నిగనిగలాడే నల్లటి కురుల కోసం 35 చిట్కాలు: ప్రస్తుతం అందరి లైఫ్‌స్టైల్ మారిపోయింది. నిగనిగలాడే జుట్టు అనేది చాలామందికి సాధ్యం కావడం లేదు. ఎండలో తిరగడమో, వానలో తడవటమో, లేక దుమ్ముధూళి పట్టడమో…ఇవేవీ కాకపోయినా అనారోగ్యం, పోషకవిలువలు సరిగా అందకపోవడమో…ఇలా చాలా కారణాల వల్ల నల్లటి కురుల సవ్వడి విన్పించడం లేదు. మహిళలతోపాటు పురుషులు కూడా జుట్టు విషయంలో చాలా బాధపడుతూ వుంటారు. జుట్టు రాలిపోవడం, తెల్లగా పాలిపోవడం, బట్టతల ఏర్పడటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి జుట్టును రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు వున్నాయి. ఈ క్రింద పేర్కొన్న 35 చిట్కాలలో ఏ ఒక్కదాన్ని పాటించినా సంబంధిత జుట్టు సమస్యను కచ్చితంగా పరిష్కరించుకోవచ్చు.
నిగనిగలాడే నల్లటి కురుల కోసం 35 చిట్కాలు
- మీ జీవన శైలి కూడా జుట్టు మీద ప్రభావం చూపుతుంది. శరీరానికి వ్యాయామాన్ని ఇచ్చేలా చూడాలి. ఒక వేళ జుట్టు విపరీతంగా ఊడుతుంటే వాటి కుదుళ్ళను బలోపేతం చేసే ట్రీట్‌మెంట్‌ని బ్యూటీపార్లర్‌లో చేయించుకోవాలి.
- మెంతికూర ఆకుల్ని మెత్తగా నూరి దానిని తలకు పట్టిస్తుంటే జుట్టు బాగా పెరుగుతుంది. నల్లటి రంగు నిలబడుతుంది.
- రెండు టీ స్పూన్‌ల కుంకుడు కాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపుతో స్నానం చేయండి. తేడా మీకే తెలుస్తుంది.
- వారానికి ఒకసారి తలకు పుదీనా పేస్ట్ రాసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచుకుని కడిగే చుండ్రు పోతుంది.
- వెంట్రుకలు ఊడకుండా ఉండడానికి మెంతులను నీళ్ళతో సహా మెత్తగా రుబ్బి తలకు పట్టించి 40 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనిని ప్రతిరోజు ఉదయం చేస్తే మంచిది. కనీసం మండలం (40 రోజులు) పాటు కొనసాగిస్తే చక్కని ప్రయోజనం కనిపిస్తుంది.
- సీకాయ పొడిలో కాస్త మజ్జిగ కలిపి తలంటుకుంటే జుట్టుకు మంచిది.
- స్నానం చేసే నీటిలో కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జుట్టుకున్న జిడ్డు వదులుతుంది.
- ఒక కప్పు దంపుడు బియ్యానికి మూడు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత బియ్యాన్ని విడిగా తీయగా వచ్చిన గంజిని చల్లారబెట్టాలి. ఈ గంజిని బాగా ఆరబెట్టి కనీసం మూడుసార్లు జుట్టుకు పట్టించాలి. తర్వాత చల్లని నీటితో శిరోజాలను శుభ్రపరచుకోవాలి. ఇది జొన్న పీచులా పలుచగా ఉండే జుట్టును ఒత్తుగా చేస్తుంది.
- ఒక టీ స్పూను నెయ్యి, టీ స్పూను చక్కెర, టీ స్పూను మిరియాల పొడి కలిపి మాడుకు అంటేలా తలకు మర్దనా చేసి ఒక పదినిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును నివారించడమే కాకుండా జుట్టును మెరిపించడానికి తోడ్పడుతుంది.
- కొబ్బరి నూనెలో వెల్లుల్లిపాయలను ఉడికించి, వడకట్టి ప్రతిరోజూ తలకు రాస్తే తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి.
- ఉసిరిపొడిని ఇనప పాత్రలో రాత్రిపూట నానవేసి ఉదయాన్నే ఆ మిశ్రమాన్ని బ్రష్‌తో వెంట్రుకలకు పట్టించండి. అనంతరం తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల మిశ్రమం ఒంటిమీద పడదు. గంట తర్వాత స్నానం చేస్తే సరి.
- ఎండలో బయటకి వెళ్ళినప్పుడు సన్‌స్క్రీన్‌ని చర్మ సంరక్షణ కోసం వాడుతుంటారు. అలాగే ఎక్కువ సేపు ఎండలో తిరగాల్సి ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ ఉన్న జుట్టు ఉత్పత్తులను వాడవచ్చు.
- ఎక్కువగా జుట్టు రాలుతోందా? అయితే, ఒక ఉల్లిపాయను మెత్తగా పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచాడు తేనె కలపాలి. తలకు పట్టించి గంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి.
- ఒక్కోసారి తలంతా దురద పుడుతుంది. అలాగని ఊరికే గోకుతుంటే మాడు పుండు పడుతుంది తప్ప దురద మానదు. ఇందుకు బీట్‌రూట్ రసం మంచి చికిత్స. అందుకు ఏం చేయాలంటే తాజా బీట్ రూట్‌ను చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో చిక్కటి రసం తీయాలి. దీనిని నేరుగా తలకు పట్టించుకోవాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. జుట్టు పట్టులా మెరుస్తుంది.
- కొంతమంది జుట్టు జిడ్డుగా, నూనెకారుతూ ఉంటుంది. తలస్నానం చేసిన కొద్దిసేపటికే జుట్టు జిడ్డుగా తయారై రాలిపోతుంటుంది. ఇటువంటి వారు ఒకవేళ కండీషనర్ వాడదలుచుకుంటే పెరుగును మాత్రం వాడుకోవాలి. కండీషనర్‌ను తలకు కాకుండా వెంట్రుకల కొసలకు ప్రయోగించాలి. స్నానానికి ఉపయోగించే నీళ్లకు కొద్దిగా నిమ్మరసాన్ని చేర్చితే జిడ్డు వదులుతుంది.
- వెంట్రుకలు తెల్లబడకుండా ఉండాలంటే ఉసిరికాయ రసం, నువ్వుల నూనె సమపాళ్ళలో కలిపి, కాచి తలకు రాసుకోవాలి.
- ఒక కోడిగుడ్డులోని సొనను చిన్న గిన్నెలో వేసి బాగా చిలకరించి అందులో ఒక నిమ్మపండు రసం కలపండి, నాలుగు చెంచాల పెరుగును కూడా ఈ సొనకు కలిపి తలకు పట్టించి అరగంటసేపు వుండండి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ వెంట్రుకలు మృదువుగా, కాంతివంతంగా వుంటాయి.
- సీకాయ, పెసలు, ఉసిరి, కరివేపాకు, నిమ్మతొక్కలు, మెంతులు వీటన్నింటిని గాలికి ఆరబెట్టి, ఎండిన తరువాత విడివిడిగా పొడిచేసుకొని ఒకటిగా కలిపి తలస్నాన చూర్ణంగా వాడుకుంటే తలకు పట్టిన జిడ్డు వదిలిపోయి కేశాలు ప్రకాశవంతంగా తయారవుతాయి.
- గాలి తగిలేలా మూడు రోజులు నిల్వ ఉంచిన పెరుగును తలకి మర్దన చేసి తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
- చిన్న గిన్నెలో నీళ్లుపోసి అందులో వాడేసిన టీ పొడి కానీ, కాఫీ పొడిని కాని వేయాలి. ఉసిరిపొడితో పాటు ఉల్లి తొక్కల్ని అందులో వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి మూడు గంటలు ఆగితే జుట్టుకు కావలసిన బలంతో పాటు మెరుపుని అందిస్తుంది.
- నీళ్ళలో కలిపిన ఆపిల్‌జ్యూస్‌ను తరచూ తలకి రుద్దుకుంటే చుండ్రు పోతుంది.
- పొడిబారిన కురులకు కొబ్బరినూనె, కొబ్బరిపాలు, పెరుగు తలాపావుకప్పు, ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకుని, అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ళకు ఇంకేలా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.
- పొడిబారిపోయి కాంతిహీనంగా తయారైన జుట్టుతో బాధపడుతున్నట్లయితే, తాజా మెంతికూరను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. దానికి చిక్కటి పెరుగు కలిపి తలకు పట్టించండి. అరగంట తర్వాత మంచి షాంపూతో తల స్నానం చేయండి. జుట్టు ఎంతో కోమలంగా తయారవుతుంది.
- బలహీనంగా పల్చగా కనిపించే జుట్టు విషయంలో మరింత శ్రద్ధ తప్పనిసరి. అందుకు బొప్పాయి, అరటిపండు ముక్కలు ఒక్కో కప్పు చొప్పున, అరకప్పు యాపిల్ ముక్కలు తీసుకోవాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా రుబ్బాలి. ఈ గుజ్జును బాగా వడకట్టాలి. అలా వడకట్టగా వచ్చిన రసాన్ని తలంతా పట్టించండి. తర్వాత వెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
- బి కాంప్లెక్స్‌లో బయోటిన్, ఫోలిక్ యాసిడ్,సమృద్దిగా ఉంటాయి. ఇక బి6 జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. మెగ్నీషియం, జింక్, సల్ఫర్‌లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతాయి.
- జుట్టు ఆరోగ్యవంతంగా పెరగాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పొడవాటి జుట్టుని ఇష్టపడేవారు, జుట్టు మరింత పొడవు అయితే బాగుండు అనుకునేవారు, ప్రొటీన్లు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. పప్పు, మజ్జిగ, గుడ్లు, పప్పుధాన్యాలు, చికెన్, పన్నీర్ ఇవన్నీ జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందిస్తాయి.
- జుట్టుకు మంచి షాంపూ, కండీషనర్‌లు రాస్తూ శ్రద్ధతీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవటం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి. కొంతమందిని. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు. మంచి సమతులాహారం తీసుకోవాలి.
- తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు పగిలిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు కూడా దెబ్బతింటాయి. ఆరిన తరువాత చిక్కు తీసుకోవటం వల్ల సులువుగా వస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఎలాంటి చిక్కూరాదు.
- తలకు గోరింటాకు పెట్టుకునే ముందు దానిలో కొద్దిగా బీట్‌రూట్ రసాన్ని కలిపితే జుట్టుకు మంచి మెరుపుతో పాటు రాగిరంగు ఛాయ వస్తుంది.
- నల్లటి కురుదులు రంగు మారుతున్నట్లనిపిస్తే వెంటనే గుప్పెడు ఎండు ఉసిరి ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి రెండు రోజుల పాటు నానపెట్టండి. ఆ తర్వాత నూనెపైకి తేటగా తేరుతుంది. అప్పుడు చక్కగా ప్రతిరోజూ ఆ నూనెని తలకు పట్టించండి. మీ సమస్య తీరుతుంది.
- నిమ్మకాయ చెక్కతో తల రుద్దుకొని వేడి నీళ్ళతో స్నానం చేస్తే చుండ్రు పోతుంది.
- పలుచని జుట్టు తరచూ రాలిపోయే జుట్టుతో బాధపడేవారు గోరువెచ్చటి ఆలివ్ లేదా బాదం నూనెతో మర్దన చేసుకుంటే సరి.
- పారిజాతం గింజల్లోని పప్పును వేరు చేసి బాగా దంచి తలకు పట్టించాలి. పావు గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.
- పెరుగు తలకు మర్దన చేసుకుని తలస్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. కళ్ళమంటలు తగ్గి నిద్ర బాగాపడుతుంది.
- పేలు మిమ్మల్ని చికాకు పెడుతున్నాయా వాటిని వదిలించుకోవడం చాలా తేలిక. ఎలా అంటే ఉసిరి విత్తనాన్ని పొడి చేసి దాన్ని నిమ్మరసంలో కలపాలి. వెంట్రుకల మొదళ్లకు ఆ మిశ్రమాన్ని పట్టించి అరగంట తర్వాత స్నానం చేయండి. పేల బెడద మిమ్మల్ని వీడుతుంది.
- తల స్నానానికి ముందు తలకు నూనె పెట్టుకుని, మృదువైన షాంపూతో తల స్నానం చేయండి. జుట్టు పొడిబారటం తగ్గుతుంది.